ధోనీ.. ఆల్​టైం అత్యుత్తమ కెప్టెన్​: పీటర్సన్​

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ చరిత్రలో ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. ఈ విషయంపై చర్చ జరిగినా.. ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎవరికైనా చాలా కష్టమని కెవిన్ ఓ టీవీ చానెల్​ కార్యక్రమంలో తేల్చిచెప్పాడు.


“టీమ్​ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు సారథ్యం వహించి ధోనీ ఎన్ని ఘనతలు సాధించాడో తెలుసు. అతడి జీవన విధానం కూడా తెలుసు. అందరికీ అతడిపై ఎన్ని అంచనాలు ఉన్నాయో కూడా తెలుసు. అందుకే ధోనీ గొప్పతనానికి వ్యతిరేకంగా వాదించడం చాలాకష్టం” అని పీటర్సన్ చెప్పాడు.


ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా 2007 టీ20 ప్రపంచకప్​తో పాటు 2011లో వన్డే ప్రపంచకప్​ను సైతం కైవసం చేసుకుంది. ఐపీఎల్​లోనూ మహీ జట్టు చెన్నె సూపర్ కింగ్స్ మూడుసార్లు టైటిల్​ను దక్కించుకుంది. కాగా, గతేడాది ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాతి నుంచి ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్​తో మళ్లీ బరిలోకి దిగుదామనుకున్నా.. కరోనా కారణంగా ఆ టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది.