ఉద్యోగులు, రైతులే లక్ష్యం.. బడ్జెట్ - 2020
న్యూఢిల్లీ: మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ - 2020 గుట్టు వీడనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాలు ప్రకటించనున్నారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. భారీ అంచనాల నడుమ ప్రవేశపెట్టనున్నఈ బడ్జెట్‌పై ఆర్థిక నిపుణుల చెబుతున్నదేంటంటే.. ఉద్యోగులు, రైతులే లక్ష్యంగా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. సెక్షన్‌ 80సి కింద పన్ను రాయితీలను కల్పించడం, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచడం వంటి అనేక చర్యలను ప్రకటించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేతన వర్గాలు పొదుపు చేసేందుకు వీలుగా జాతీయ పింఛన్‌ పథకం, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ డిపాజిట్ల పెంపు, పన్ను లేని సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ పథకం తదితరాలను ప్రకటించవచ్చునని అంచనా వేస్తున్నారు. మధ్య తరగతి చెల్లించే పన్ను శ్లాబ్‌లను పెంచి, పన్ను లేని నగదు చేతిలో ఆడేలా చేయడం ద్వారా వినియోగాన్ని పెంచాలని, తద్వారా, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే పథకాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది.





అలాగే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా గ్రామీణ రంగానికి భారీ కేటాయింపులు ఉంటాయని, ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తులు, ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక రాయితీలు ప్రకటిస్తారని అంటున్నారు. కార్పొరేట్‌ బాండ్లు, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభుత్వ బాండ్లు, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి అనేక నిర్ణయాలను ప్రకటించవచ్చని తెలిసింది.